మీరెప్పుడు ఇంటికి వెళ్తారని చంద్రబాబుని ప్రశ్నించిన రోజా?

SMTV Desk 2017-07-30 14:09:34  MLA Roja, Roja about AP Govt, Roja fire about AP new retirement policy

అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష కాలం వచ్చింది, ఇక ప్రైవేటు ఉద్యోగులకు వారికీ ఎలాంటి తేడా ఉండదు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా పరీక్షలు నిర్వహించి, 50 ఏళ్లకు పైబడి వయస్సున్న వారిని బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలో, వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ విషయంపై మండిపడ్డారు. "బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు, ఆయన కొడుక్కి మంచి అధికారాలు వచ్చాయే తప్ప, రాష్ట్రంలోని ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను రోడ్డు మీద పడేసే విధంగా, 50 ఏళ్లు దాటితే, ఇంటికి పంపించేస్తాం. వాళ్ల పనితీరు బాగుంటేనే ఉంచుకుంటాం అంటున్నారు. నేను చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు 67 సంవత్సరాలు మీకు వచ్చాయి. మీరు ఏ విధంగా సీఎం పదవిలో ఇంకా కొనసాగుతున్నారు? మీరు ఇంటికి వెళ్లరా? మీకిది వర్తించదా? అని నేను అడుగుతున్నాను" అని అన్నారు. ఈ విధంగా విచిత్రమైన నియమనిబంధనలు ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకం అని ఆమె ధ్వజమెత్తారు.