కేరళ సర్కారుపై ధ్వజమెత్తిన మోదీ..

SMTV Desk 2019-01-17 12:25:41  sabarimala, kerala government, Narendra Modi, LDF, Congress

కొల్లం, జనవరి 17: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్‌ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసి ప్రజాధనాన్ని కాపాడిన తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, వొడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, కాంగ్రస్ నాణేనికి బొమ్మా.. బొరుసు వంటివని పేర్కొన్నారు.

‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ఇలా చేయలేదు. ఎల్‌డీఎఫ్‌ కు కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హీనంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు అని తీవ్రంగా మండిపడ్డారు. శబరిమల అంశంపై పార్లమెంట్‌ లోపల వొకలా, శబరిమలలో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ లకు వొక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్‌ రోడ్డును, బలంగీర్‌(వొడిశా)లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు.