జగన్ హత్యయత్న కేసులో మరికొందరికి నోటీసులు

SMTV Desk 2019-01-17 11:33:47  YS Jagan mohan reddy, Attempt to murder case, NIA, Notices

హైదరాబాద్, జనవరి 17: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్న కేసులో ఎన్ఐఎ తాజాగా మరికొందరికి నోటీసులు పంపింది. గత ఐదు రోజులుగా ప్రధాన నిందుతుడైన శ్రీనివాసరావు ను హైదరాబాద్ లో విచారిస్తున్న సంగతి తెలిసిందే. మాదాపూర్‌లోని ఎన్‌ఐఎ కార్యాలయంలో శ్రీనివాసరావును విచారిస్తున్న ఎన్‌ఐఎ అధికారులు ఈ కేసులో మరింత సమాచారం కోసం గతంలో అతను పనిచేసిన వైజాగ్‌ విమానాశ్రయంలోని క్యాంటీన్‌ యజమానితో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. శ్రీనివాసరావుకు సంబంధించిన వివరాలను తమ కు తెలపాలని ఆ నోటీసులో ఎన్‌ఐఎ అధికారులు కోరారు. కాగా శ్రీనివాసరావును మంగళవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతని ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఎన్‌ఐఎ కార్యాలయానికి తరలించారు.

జగన్‌పై దాడి చేయడం వెనుక ఎవరి హస్తం లేదని, తాను వొక్కడినే ఇలా చేశానని, ఇలా చేయడం వల్ల జగన్‌పై సానుభూతి పెరిగి సిఎం అవుతాడని భావించానని ఈ కేసులో నిందితుడుగా వున్న శ్రీనివాసరావు ఎన్‌ఐఎకు చెప్పాడని అతని తరపు న్యాయవాది సలీం తెలిపారు. శ్రీనివాసరావు కాల్‌ డేటాపై ఆరా తీస్తున్న ఎన్‌ఐఎ, అతను వైజాగ్‌ జైల్లో వుండగా రాసిన 22 పేజీట నోట్‌ను పరిశీలిస్తున్నారు. కాగా శ్రీనివాసరావు బయటకు వస్తే అతని ప్రాణాలకు హానీ వుందని, అయినప్పటికీ బెయిలు పిటిషన్‌ దాఖలు చేశామని న్యాయవాది సలీం తెలిపారు. ఎన్‌ఐఎ అధికారులకు శ్రీనివాసరావు సహకరిస్తున్నాడని ఆయన తెలిపారు.