సూర్య మరోసారి

SMTV Desk 2019-01-16 10:38:14  Surya, NGK, Gold coins

చెన్నై జనవరి 16: సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులకు కానుకలు ఇవ్వడం కోలీవుడ్‌లో ఇదివరకే జరిగింది. అగ్ర కథానాయకులు విజయ్‌, ధనుష్‌‌, సూర్య తదితరులు సినిమా కోసం పనిచేసిన వారికి కానుకలు ఇచ్చారు. కాగా సూర్య మరోసారి అందరికీ కానుకలిచ్చి వారి ఆనందానికి కారణం అయ్యారు. ఆయన నటిస్తున్న చిత్రం “ఎన్జీకే” సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

పొలిటికల్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. “వన్‌ అండ్‌ ఓన్లీ సూర్య సర్‌తో ఇది ఓ అద్భుతమైన సినీ ప్రయాణం. ఆయన అంకితభావం, ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతివొక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు సూర్య బంగారు నాణేలు కానుకగా ఇచ్చారట. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆయన దాదాపు 120 మందికి బహుమతులు ఇచ్చినట్లు సమాచారం.