భారీ ఎత్తున కోడి పందేలు

SMTV Desk 2019-01-15 16:35:43  Cock fight, Krishna District, 50 crores

కృష్ణ , జనవరి 15: కోడిపందేల్లో వాటి కాళ్లకు కత్తులు కట్టి హింసకు చోటు ఇవ్వకూడదని కోర్టు ఆంక్షలు విధించినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎంచక్కా ఆంక్షలను గాలికి వదిలేసి పందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో సోమవారం నుంచి కోడి పందేలు జరుగుతున్నాయి. ఈ వొక్క జిల్లాలోనే దాదాపు 90 చోట్ల పందేలు జరుగుతున్నాయి. నోట్లకట్టలు వెదజల్లుతున్నారు. ఓవైపు పూర్తి నిఘా ఉందనీ, డబ్బుతో కోడి పందేలు ఆడనిచ్చేది లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. మద్యం అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఉదయం భోగి సంబరాలు చేసుకున్న ప్రజలు… మధ్యాహ్నం నుంచీ పందెం బరులకు తరలివెళ్లారు. భోగి రోజున ఏకంగా రూ.50 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి హింసాత్మక ఆట ఆడిస్తున్నారు. దీంతో వేల కోళ్లు బలైపోతున్నాయి. కాగా, ఈ పందేలను పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. భోగి రోజు వదిలేస్తే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఏరులై పారుతాయో అంటున్నారు స్థానికులు.

రాజకీయ వొత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసులు… లైట్ తీసుకుంటున్నారని సమాచారం. చాలామంది అమాయక ప్రజలు డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. ఈ పందేల కారణంగా కృష్ణాజిల్లా కొడవటికల్లు ప్రాంతంలో భట్టిప్రోలు రవి అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.