శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకించిన భక్తజనం

SMTV Desk 2019-01-15 11:09:12  Sabarimala, Makarajyothi

కేరళ , జనవరి 15:శబరిమల అయ్యప్ప స్వామి సమక్షంలో లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకున్నారు. పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా వద్ద మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అపురూపమైన జ్యోతిని దర్శించుకున్న భక్తులంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే మకరజ్యోతిని దర్శించుకొనేందుకు భక్త జనసాగరం భారీ ఎత్తున కదిలి వచ్చింది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు సుమారు 18 లక్షల మందికి పైగా భక్తులు నేడు శబరిమలకు హాజరయ్యారు. పొన్నంబల కొండపై వెలిగిన జ్యోతి భక్తులను ఆనంద పరవశులను చేసింది.

సంప్రదాయాన్ని అనుసరించి సాయంత్రం 6.40 నిమిషాల తర్వాత మండల పూజ జరిగిన అనంతరం కొండపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనం కాగానే లక్షలాది భక్తులంతా “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ శరణు ఘోష చేశారు. మకరజ్యోతిని అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భక్తులు నమ్ముతారు. ఈ జ్యోతిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చారు. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు.