తెరాసలో చేరే ఉద్దేశ్యం లేదు

SMTV Desk 2019-01-15 10:53:42  TRS, congress, duddilla Sridhara Babu,

హైదరాబాద్, జనవరి 15: ఇటీవల సిఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు కరీంనగర్ వెళ్లినప్పుడు కాంగ్రెస్‌తో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి వెళ్ళి కలిశారు. అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాము తప్ప తెరాసలో చేరే ఉద్దేశ్యంతో కాదని వారు స్పష్టం చేసినప్పటికీ వారు పార్టీ మారబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వారితో పాటు తాజాగా కాంగ్రెస్‌తో ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేరు కూడా వినిపిస్తోంది. అయితే వారు ముగ్గురూ మీడియాలో వస్తున్న ఆ వార్తలను మరోసారి ఖండించారు. వారు హైదరాబాద్‌లో మీడియా ప్రతీధులతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాము కనుక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాము. మాతో తెరాస నేతలెవరూ టచ్‌లో లేరు. మేము కూడా ఎవరితోనూ టచ్‌లో లేము. తెరాస నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ వారెన్నివిధాలుగా ప్రయత్నించినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాము,” అని చెప్పారు.

సంక్రాంతి పండుగ తరువాత కనీసం అరడజను మంది కాంగ్రెస్‌తో నేతలు తెరాసలో చేరడానికి సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పండుగ తరువాతే మంత్రివర్గం ఏర్పాటవుతోంది. కనుక మరో మూడు రోజులు ఆగితే ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు.. ఎవరెవరు తెరాసలోకి జంప్ చేస్తారు? అనేది తేలిపోతుంది.