కోడికత్తి కేసు నిందితుడు హైదరాబాద్ కు తరలింపు

SMTV Desk 2019-01-13 19:09:18  YS Jagan mohan reddy, Attempt to murder, Accused srinivasrao, NIA

విశాఖపట్నం, జనవరి 13: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ రావును ఈ రోజు ఎన్ఐఎ అధికారులు విశాఖపట్టణం నుండి హైదరాబాద్ కు తరలించారు. అయితే విశాఖలో శ్రీనివాసరావు విచారణ క్షేమం కాదని హైద్రాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని శ్రీనివాసరావు న్యాయవాది సలీంకు అప్పగించారు. ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావును విశాఖ బక్కన్నపాలెం సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నట్టుగా శ్రీనివాసరావు న్యాయవాది సలీంకు ఆదివారం నాడు ఉదయం సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావును విచారించేందుకు అనువైన ప్రదేశం కాదని ఎన్ఐఏ అభిప్రాయపడినట్టుగా సలీం చెబుతున్నారు. చెన్నై, కోల్ కత్తా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో శ్రీనివాసరావును విచారించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఈ కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టడాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మోడీకి ఏపీ సీఎం లేఖ కూడ రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి విచారణ జరపుతామని ఎన్ఐఏ అధికారలు చెప్పారని లాయర్ సలీం ప్రకటించారు. అయితే ఎక్కడికి తరలించే విషయాన్ని రెండు గంటల ముందుగానే సమాచారం ఇస్తామని ఎన్ఐఏ తమకు సమాచారం ఇచ్చిందని సలీం చెప్పారు. శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారణ చేయలేదని చెప్పారు.