తెరాసతో టీడీపీ...!!!

SMTV Desk 2019-01-13 18:01:34  TRS, TDP, Khammam, Telangana panchayat elections

ఖమ్మం, జనవరి 13: రానున్న గ్రామ పంచాయతి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఊహించని విధంగా పొత్తుల వ్యవహారాలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో ఇతర పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తె బగ్గుమనేంత పోటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అదే పార్టీకి మద్దతిచ్చేందుకు ఇతర పార్టీలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న వైఖరిని నిరసిస్తూ పొత్తుకు సిద్దం కావాల్సి వచ్చిందని విపక్షాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పీపుల్స్ ఫ్రంట్‌లో లుకలుకలు చోటు చేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలను నిరసిస్తూ టీడీపీ నేతలు అనేక గ్రామపంచాయితీల్లో టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచాయి.

పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ, బిక్కుతండా, తోగ్గూడెం, పాండురంగాపురంలలో వొక్క స్థానానికి, జగన్నాధపురం, రేగులగూడెం స్థానాల్లో టీడీపీకి టీఆర్ఎస్‌ మద్దతు తెలిపింది. మిగిలిన 30 గ్రామ పంచాయితీల్లో టీడీపీ నేతలు టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీకి కేటాయించిన స్థానాల్లో కూడ టీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థులను బరిలోకి దించారు. పొత్తు ధర్మానికి విరుద్దంగా పోటీ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తీరుతో సీపీఐ కూడ అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు అవసరమైతే టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ భావిస్తోన్నట్టు ప్రచారం సాగుతోంది. సీపీఎం నేతలు కూడ అవసరమైతే టీఆర్ఎస్‌తో కలిసి పోటీకి సిద్దమయ్యారనే ప్రచారం కూడ లేకపోలేదు.