సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం

SMTV Desk 2019-01-13 17:26:50  Clash Between TDP MLA Bode Prasad and Sub Collector Misha Singh, Proklein seize, Krishna district

కృష్ణా, జనవరి 13: శనివారం రాత్రి విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్‌, కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉయ్యూరు నియోజకవర్గంలోని పెనమలూరు మండలంలోని వణుకూరు గ్రామ పరిధిలోని పుల్లేరులో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వడం, చెట్లను నరకడంతో వివాదంగా మారింది. పూర్తి వివారాల ప్రకారం వణుకూరు-ఈడ్పుగల్లు గ్రామాల మధ్య పుల్లేరు వాగు ఉంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పుల్లేరు వాగులోకి యంత్రాలను తీసుకొచ్చి చెట్లను తొలగించి మట్టిని తవ్వారు. ఈ మట్టిని తవ్వి ప్రభుత్వ పోరంబోకు స్థలంలో పోశారు. ఈ విషయమై స్థానికులు తహసీల్ధార్ కు ఫిర్యాదు చేశారు. వణుకూరులోని రెవెన్యూ సర్వీసు నెంబర్ 364లోని 2.84 సెంట్ల ప్రభుత్వ మురుగు కాల్వను అన్యాక్రాంతం చేస్తే చర్యలు తీసుకొంటామని తహసీల్దార్ బోర్డు కూడ ఏర్పాటు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది.

దీంతో ఎమ్మెల్యే శనివారం నాడు ఆయన ప్రాంతానికి వెళ్లాడు. రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రసాద్ తన కార్యాలయానికి తీసుకెళ్లాడు. అయితే ఈ విషయమై విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ పోరంకి కార్యాలయంలోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. సీజ్ చేసిన వాహనాన్ని అప్పగించకపోతే రూ.2 లక్షలు ఫైన్ కట్టాలని మిషాసింగ్ ఎమ్మెల్యేను కోరింది. రైతులు తమ గట్లకు ఈ మట్టిని వాడుకొంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయమై ఎమ్మెల్యేను రూ. 2 లక్షలు చెల్లించాలని కోరింది. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వినందుకు వాల్టా చట్టం కింద కేసులు పెడతామని మిషాసింగ్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసిన యంత్రాన్ని దౌర్జన్యంగా తీసుకువచ్చిన తీరుపై ప్రస్తుతం ఇన్‌చార్జి కలెక్టరుగా ఉన్న జేసీకి సమగ్ర నివేదిక సమర్పించాలని పెనమలూరు తహసీల్దారు మురళీకృష్ణను ఆదేశించి అక్కడి నుంచి వెళ్లిపోయా రు. ఈ విషయమై ఉయ్యూరు ఎమ్మెల్యే రైతుల తరపున రూ.2 లక్షలు చెల్లించేందుకు తాను సిద్దంగా ఉన్నానని బోడే ప్రసాద్ ఆదివారం నాడు ప్రకటించారు.