ఢిల్లీలో చక్రం తిప్పడానికి....కేసీఆర్ మరో యాగం

SMTV Desk 2019-01-12 13:25:42  Telangana CM, KCR, Delhi, Maharudra sahasra chande yagam

హైదరాబాద్, జనవరి 12: ఈ నెల 21 నుండి 25 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో మహా రుద్ర సహస్ర చండీయాగాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆధ్వర్యంలో సుమారు 200 మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు వేరే కారణాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కేసీఆర్ ఏదైనా పనిని ప్రారంభించడానికి దైవబలం తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో యాగం చేస్తారు. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్లుగా కంటిన్యూ అవుతోంది.

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ‘‘ఆయుత మహా చండీ యాగాన్ని చేసిన ఆయన ఆ తర్వాత టీటీడీపీని ఖాళీ చేయడంతో పాటు తన గురువు, రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుపై పైచేయి సాధించారని చెబుతారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లేముందు ‘‘రాజశ్యామల యాగాన్ని గులాబీ బాస్ నిర్వహించారు. దీని ఫలితంగానే ఆయన రెండోసారి అధికారాన్ని అందుకున్నారని భావన. ఈసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఢిల్లీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి ‘‘చతుర్వేద పురస్సర సహిత సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ యాగానికి సందర్శకులు, భక్తుల్ని అనుమతించే విషయంపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.