అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కి హోదా: రాహుల్

SMTV Desk 2019-01-12 12:16:50  AP Special Category Status, congress party, Rahul Gandhi, Dubai

దుబాయ్‌, జనవరి 12: జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. విదేశీ పర్యటన నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన రాహుల్ శుక్రవారం స్థానిక లేబర్‌ కాలనీలో భారతీయ కార్మికులనుద్దేశించి మాట్లాడారు. రానున్న 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము చేసే మొదటి పని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడమేనని రాహుల్‌ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేశారని, అయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఎంతమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ఇవ్వాల్సిన ముఖ్యమైన హామీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్మరించారు. ఏపీకి అమలవ్వాల్సిన హామీల విషయంలో మనమంతా కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దుబాయ్‌ ప్రపంచంలో అత్యద్భుత నగరంగా నిలవడంలో భారత కార్మికుల శ్రమ ఎంతో ఉందన్నారు. వారు ఇక్కడ పనిచేస్తూ భారతదేశాభివృద్ధికి దోహదపడుతున్నారని ప్రశంసించారు. దుబాయ్‌లోని అందమైన ఆకాశ హర్మ్యాలు, ఎయిర్‌పోర్టులు వారి శ్రమ, స్వేదంతో నిర్మితమైనవేనని అన్నారు. భారతీయుల శ్రమశక్తి లేకుంటే ఈ అద్భుతాలు సాధ్యమయ్యేవి కాదన్నారు.