హైదరాబాద్, జనవరి 11: ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాత్మకమైన సినిమాల తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వరుస ప్రయోగాల తరువాత చరణ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? రామ్‌చరణ్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? బోయపాటి మాస్ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యిందా..?
సినిమా : వినయ విధేయ రామ
నటీనటులు : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ వొబెరాయ్, ప్రశాంత్, స్నేహ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డీవీవీ దానయ్య
కథ :
రామ (రామ్‌చరణ్)కు తన కుటుంబం అంటే ప్రాణం. తన పెద్ద అన్నయ్య భువన్ కుమార్(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన కుటుంబం కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్ కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు. అయితే, అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్ మున్నా (వివేక్ వొబెరాయ్). రాజు భాయ్ తన ప్రాంతంలో ఎలక్షన్‌లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో కూర్చోబెడుతున్నాడని తెలిసిన ప్రభుత్వం భువన్ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్ కమీషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్, భువన్ కుమార్‌ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
చరణ్ డాన్స్ పరంగా, నటన పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో వొదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వచ్చే పెద్ద హీరోల సినిమాల్లో కథానాయికలకు ప్రధానీత ఉండట్లేదు. అలాగే ఈ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్ వొబెరాయ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, రవి వర్మ, మధునందన్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.
ప్లస్ పాయింట్స్ :
➧ రామ్ చరణ్
➧ పాటలు
➧ కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
➧ అతిహింస
➧ ఫోర్స్‌డ్ సీన్స్
➧ నేపధ్య సంగీతం
➧ దర్శకత్వం