బ్రాహ్మణులకు తీపి కబురు...

SMTV Desk 2019-01-11 11:45:39  Brhamins, AP CM, AP Government, Brahmins Corporation

అమరావతి, జనవరి 11: రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. బ్రాహ్మణ యువతులు అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు వెనుకాడడంతో బ్రాహ్మణ కార్పొరేషన్ రూపొందించిన కళ్యాణమస్తు కార్యక్రమానికి ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అర్చకులను, పురోహితులను బ్రాహ్మణ యువతి వివాహం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు....దీంతో వారికి వివాహమూ కావడం లేదు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ కార్పొరేషన్ తొలి చైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు పురోహితులను, అర్చకులను బ్రాహ్మణ యువతిలు పెళ్లి చేసుకుంటే రూ.1 లక్ష ఇస్తామని కార్పొరేషన్ తరపున ప్రకటించారు. అయితే అది అమలులోకి రాకపోగా అనంతరం నూతన చైర్మెన్ వేమూరి ఆనందసూర్య గురుపత్ని పేరు పేటి రూ 1లక్ష ఇస్తామని మళ్ళీ ఆశలు పెట్టారు. ఇది కూడా అమల్లోకి రాలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణ యువతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్చక, పురోహితులను వివాహం చేసుకునే యువతులకు రూ.75 వేల వంతున ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

2018 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లయింది. జనవరి 15వ తేదీ తర్వాత ఇలా వివాహం చేసుకున్నవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ డీహెచ్ వీ సాంబశివరావు తెలిపారు. ఎట్టకేలకు ఈ పథకాన్ని సాధించిన చైర్మన్ ఆనంద సూర్య, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఏప్రిల్ వొకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న అర్చక, పురోహితులు ఈ పథకానికి అర్హులని, ఇతర వివరాలకు ఈనెల 15 నుంచి ఆన్లైన్లో పూర్తి సమాచారం తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్దింటి గోపాలకృష్ణ, కేశవుడు, వడ్డాది సత్తిబాబు, వరాహ నరసింహ మూర్తి, చంటి, అల్లంరాజు బాబి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.