సివిల్స్ తెలుగు ఆణిముత్యాలు

SMTV Desk 2017-06-01 11:29:47  civils toppers, first ranker nandini, second ranker share sing, third rank gopala krishna,

హైదరాబాద్, జూన్ 1 : సివిల్ సర్వీసెస్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆణిముత్యాలుగా మేరిశారు. రెండు రాష్ట్రాల నుండి పది శాతం సీట్లు సాధించి తెలుగు సత్తాను జాతీయంగా చాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి మెుత్తం 90 మంది అభ్యర్థులు సివిల్స్ లో స్థానం సాధించారు. కర్ణాటకకు చెందిన నందిని జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలువగా, పంజాబ్ కు చెందిన షేర్ సింగ్ బేడి ద్వితీయ స్థానం, శ్రీకాకుళం కు చెందిన గోపాల కృష్ణ తృతీయ ర్యాంకు సాధించారు. అదే విధంగా కృష్ణ జిల్లాకు చెందిన దినేష్ కుమార్ 6వ ర్యాంకు, మాజీ ఐపిఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ 22 వ ర్యాంక్ తో సివిల్స్ లో విజయం సాధించారు. అదే విధంగా హైదరాబాద్ కు చెందిన సమీర్ కుమార్ 142 వ ర్యాంకు, వరుణ్ రెడ్డి 166 వ ర్యాంకు, మల్లవరపు బాలలత 167 వ ర్యాంకు సాధించగా,కర్నూల్ కు చెందిన సాయి వంశీవర్ధన్ 220 వ ర్యాంకును సాధించారు. కర్ణాటకకు చెందిన నందిని తొలి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్ గా ఎంచుకుని ఆమె సివిల్స్ నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం రాత్రి 2016 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఫలితాలను ప్రకటించింది. గత సంవత్సరం ఆగస్టులో 11 లక్షల 35 వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4 లక్షల 59 వేల 659 మంది పరీక్షలకు హజరయ్యారు. 2016 డిసెంబర్ లో నిర్వహించిన మెయిన్స్ కు 15 వేల 452 మంది ఎంపికవ్వగా.. తుదకు 2 వేల 961 మందికి మే నెలలో నిర్వహించిన మౌఖిక పరీక్షలో 1099 మందిని ఎంపిక చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్, సెంట్రల్ సర్వీసెస్ - గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులకు అర్హత సాధించారు. అందులో 253 మంది మహిళలు స్థానాలు దక్కించుకున్నారు. టాప్ 25 లో 18 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.ఎంపికైన వారిలో 500 మంది జనరల్ కేటగిరిలో, 347 మంది ఓబిసి కేటగిరి లో, 163 మంది ఎస్ సి, 89 మంది ఎస్ టి కేటగిరిలకు చెందిన వారు ఉన్నారు.మరో 172 మందిని రిజర్వులిస్టులో పెట్టారు. ఐఏఎస్ కు ఎంపికైన 180 మందిలో జనరల్ 90, ఓబిసి 49, ఎస్ సి 27, ఎస్ టి 14 మంది ఉన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) కు ఎంపికైన 45 మంది అభ్యర్థుల్లో జనరల్ 26, ఓబిసి 12, ఎస్ సి 6, ఎస్ టి కేటగిరిలో ఒకరు ఉన్నారు.ఐపిఎస్ కేటగిరిలో ఎంపికైన 150 మందిలో జనరల్ 81, ఓబిసి 37, ఎస్ సి 18, ఎస్ టి 14 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.