ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే జనసేన..!!!

SMTV Desk 2019-01-10 16:34:37  Janasena, AP, YS Jaganmohan reddy, Pawan kalyan

విజయవాడ, జనవరి 10: గురువారం కడప జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్‌ మాటాతీరును తప్పుపట్టారు. జగన్‌లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. నేను ఎవరి పైన ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించాననిగ స్పష్టం చేశారు.

ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడో పక్షంగా జనసేనను స్థాపించానని వివరించారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక మార్పు కోసమే తాను జనసేనను స్థాపించానని పవన్‌ చెప్పారు. పీఆర్పీ కంటే ముందే కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టానని, 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని విమర్శించారు. రాజకీయాలు తనకు వ్యాపారం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయని, ఏపీకి మేలు జరుగుతుందనే ప్రధాని మోదీని సపోర్ట్‌ చేశానని పవన్‌ చెప్పారు.