రైతులకు వరాల జల్లు కురిపించిన జగన్

SMTV Desk 2019-01-10 14:17:45  YS Jagan mohan reddy, Praja sankalpa yatra, Ichhapuram, Formers Security

శ్రీకాకుళం, జనవరి 10: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్రకు బుదవారం ఇచ్చాపురంలో ముగింపు సభ జరిగింది. ఈ సభకు జగన్ అభిమానులు తండోపతండాలుగా హాజరయ్యారు. కాగా ఆ ప్రాంతం అంతా జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్త్తే రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నవరత్నాలాంటి 9 పథకాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పాలన దిశగా శ్రీకారం చుడుతుందని అందులో మొదటిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 12 గంటలకు పగటి పూట ఉచిత విద్యుత్‌అందిస్తామని, వడ్డీ లేనిరుణాలు అందిస్తామని, ఏడాదికి 12500 రూపాయలు చొపున రైతుకు పెట్టుబడి నేరుగా చేతికే అందిస్తామని అన్నారు. 42లక్షల మంది చిన్నకారు రైతులు, 19లక్షల మంది సన్నకారు రైతులు ఉన్నారని అన్నారు. వీరందరికీ రైతు బంధు పథకం అమలు చేయడమే కాకుండా 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థీరీకరణనిధి ఏర్పాటు చేస్తామని, సహకార డెయిరీలకు లీటరు పాలుకు 4రూపాయలు చొప్పున బోనస్‌ చెల్లిస్తామని అన్నారు. వ్యవసాయం చేసే ట్రాక్టర్లుకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తామని అన్నారు. రైతులకు వైఎస్సార్‌ బీమా పథకం కింద 5లక్షల రూపాయల బీమా పథకం ప్రవేశపెడతామని చెప్పారు. ఈ బీమా పథకం కింద పరిహారం అందుకున్న రైతు కుటుంబాలకు మాత్రమే డబ్బులు వినియోగించే విధంగా వేరెవ్వరికి అధికారం లేకుండా ఉండేందుకు అసెంబ్లీలో మొదటి సమావేశాల్లోనే చట్టం తీసుకు వచ్చి తీర్మానం చేస్తామని అన్నారు. 4వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తామని ఆ అందులో కేంద్రం వాటా 2వేలకోట్ల రూపాయలుకాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2వేల కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. కొబ్బరిచెట్టుకు 3వేల రూపాయలు చొప్ఞ్పున పరిహారం అందిస్తామని, జీడితోటకు 50వేల రూపాయల పరిహారం అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను దేవుడు ఆశీర్వదించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని వొక జిల్లాగా 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తద్వారా అధికార వికేంద్రీకరణ ఉంటుందని చెప్పారు. ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వొక జిల్లా కలెక్టర్‌ ఉండే విధంగా పరిపాలన సౌలభ్యం కల్పిస్తామని అన్నారు. గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు చేసి పది మంది స్థానికులకు ప్రతి గ్రామంలో ఉద్యోగాలు కల్పిస్తామని, నవరత్నాల పథకాల అమలుకు ప్రతి 50 ఇళ్లకు వొక వలంటీర్‌ను నియమించి 5వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం డోర్‌డెలివరీ చేసి జవాబుదారీతనంగా ఉంటారని చెప్పారు.

జలయజ్ఞం కింద ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. తనకు డబ్బులపై వ్యామోహం లేదని వొకసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పాటు సుభిక్షమైన పాలన అందించి తాను చనిపోతే ప్రతి ఇంటిలో ఫోటో ఉండే విధంగా పని చేయడమే ధ్యేయమని అన్నారు. ప్రతి కార్యకర్త నవరత్నాల పథకాలపై ప్రచారం చేయాలని చెప్పారు. నన్ను నడిపించింది జనమే 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర నడిచింది తానైనా నడిపించింది ప్రజలేనని అన్నారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని అన్నారు. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని, కరువుపై రెయిన్‌ గన్‌లతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వర్షపాతం తక్కువగా నమోదైనా, పంటల దిగుబడి తగ్గినా, విస్తీర్ణం తగ్గినా పట్టని చంద్రబాబు దేశ రాజకీయాలు అంటూ పర్యటనలు సాగిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ పాలనకు చంద్రబాబు పాలనకు పంటల దిగుబడిలో వ్యత్యాసం ఉందని అన్నారు. నాబార్డు నివేదిక ప్రకారం రైతుల నెత్తిన తలసరి అప్ఞ్పులో రాష్ట్రం 2వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయంలో 28వ స్థానంలో ఉందని అన్నారు. 86712 కోట్ల రూపాయల రుణమాఫీ చేయకపోగా ప్రస్తుతం వడ్డీతో కలిపి లక్షా 30వేల కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. రైతులు ‘నిన్ను నమ్మం బాబు అంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రైతుల పంటల్లో దళారీ వ్యవస్థ పెరిగిపోవడంతో దళారీ వ్యవస్థకు కెప్టెన్‌ చంద్రబాబు అని అన్నారు. ధాన్యం మద్దతు ధర 1750 రూపాయలు ఉంటే 1100 రూపాయలు కూడా రావడం లేదని అన్నారు. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన పలాస జీడిపప్పు రైతుల వద్ద 600 రూపాయలకు కొనుగోలు చేసి రిటైల్‌ షాపులలో 1100రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. 14వేలకోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో బకాయిలు 22174 కోట్ల రూపాయలకు చేరాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మోసం చేశారని, లక్ష మంది ఆదర్శ రైతులను 3500 గృహానిర్మాణ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లును ఆయుష్‌, సాక్షరభారత్‌లో మరో 30వేల మందిని మధ్యాహ్న భోజన కార్మికులు 85వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగాలు ఊడదీశారని అన్నారు. 2లక్షల 40వేల ఉద్యోగాలు నాలుగున్నరేళ్ల కాలంలో పోయాయని అన్నారు. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 80లక్షల ఉద్యోగాలు అంటూ ఊరిస్తూ 40లక్షల ఉద్యోగాలు వచ్చాయని బాబు ప్రచారం చేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, డీఎస్సీ, పోలీస్‌ నోటిఫికేషన్లు భర్తీ చేయడం లేదని అన్నారు. సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు, ఉత్తరాంధ్ర జ్యూట్‌ మిల్లులు, గుంటూరు, కృష్ణా జిల్లాల స్పిన్నింగ్‌ మిల్లులు, ప్రకాశం గ్రానైట్‌ పరిశ్రమ, కర్నూలు నాపరాయి పరిశ్రమ, ఫెర్రోఎలైస్‌ వంటి కంపెనీలు మూతపడ్డాయని అన్నారు. 2వేల రూపాయల నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికలకు 3 నెలల ముందు లక్షా 72వేల ఇళ్లకు గాను కేవలం 3లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వడంతో ‘నిన్ను నమ్మం బాబు అని నిరుద్యోగులు అంటున్నారని చెప్పారు.

జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తుందని, ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లుకు కూడా లంచం ఇవ్వాలని అన్నారు. ఇసుక, బొగ్గునుంచి రాజధాని భూములు, విశాఖ భూములు, దళితుల భూములు, గుడి భూములుతో సహా దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని, నాలుగేళ్ల పాటు బిజెపితో చిలక గోరింక తలదించుకునేలా ప్రేమించుకుని ప్రస్తుతం సినిమా చూపిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై వెటకారం చేసి ఇప్పుడు అదే ప్రత్యేక హోదాతో ధర్మపోరాట దీక్షలు చేస్తూ మోడీపై యుద్ధం పేరుతో ఎల్లో మీడియాలో గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టిన పథకాలు అమలు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుని రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని, రాజకీయ ప్రక్షాళన జరిగి నీతి వంతమైన పాలన అందించాలని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవస్థను ప్రక్షాళనచేసి మార్పులు తీసుకు వస్తామని అన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని, అన్ని సంక్షేమ హాస్టళ్లను ఎత్తి వేశారని, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చారని, 23వేల మంది ఉపాధ్యాయుల ఖాళీలకు గాను భర్తీ చేయకుండా నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు స్కూళ్లకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. 8 నెలలుగా ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని, 4వేల మంది ఉద్దానం కిడ్నీ రోగులు ఉంటే 1400మంది మాత్రమే ప్రభుత్వఆసుపత్రిలో డయాలసిస్‌ చేసుకుంటున్నారని, కేవలం 370 మందికి పింఛన్లు అందిస్తున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం ప్రధాన కార్యదర్శులు బొత్స సత్యన్నారాయణ, ధర్మాన ప్రసాదరావు, వై.వి.సుబ్బారెడ్డి, మాజీ ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌, నర్తు రామారావు, స్థూపం నిర్మాత కాయల వెంకట్‌ రడ్డి, సినీనటి రోజా, భానుచందర్‌, తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు కంబాల జోగులు,కళావతి, రాచముల్లు శివప్రసాద్‌రెడ్డి, వాసిరెడ్డిపద్మ, సి.రామ చంద్రయ్య, మల్లాది విష్ణు, వెన్నంపల్లి శ్రీనివాస్‌, కారుమూరు నాగేశ్వర రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.