పోలీసులకి శుభవార్త...

SMTV Desk 2019-01-10 13:36:44  Telangana police, Police duty time, BPRD, Police notifications

హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల డ్యూటి అంటే 24 గంటల పని సమయం, షిఫ్టుల వారిగా చేసే అవకాశముండదు. అయితే దీని వల్ల పోలీసుల ఆరోగ్యం దెబ్బ తింటుందని అలాగే వారు ప్రజలకు మెరుగైన భద్రతా ఇవ్వలేకపోతున్నారని తాజగా ఓ సర్వేలో తేలింది. కావున పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే వారికి కాసింత విరామం ఇవ్వాలని, అందులో భాగంగా షిఫ్టుల వారిగా వారి విధులను నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించుకుంది. ఈ మధ్య పోలీసు శాఖ పనితీరుపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కీలకాంశాలు వెలుగుచూశాయి. బీపీఆర్డీ, ఆస్కీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పోలీసులు విరామం లేకుండా పనిచేస్తున్న విధానం.. వారి పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తోందనే విషయం బయటపడింది. 23 రాష్ట్రాల్లోని 319 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. మొత్తంగా 9 రకాల పోలీస్ స్టేషన్లను శాంపిల్ గా తీసుకుని అధ్యయనం చేశారు. 8గంటల షిఫ్ట్ విధానం అమలుకై సాధ్యాసాధ్యాలను కూడా లెక్కించారు. విశ్రాంతి లేకుండా కంటిన్యూయస్ గా డ్యూటీలో ఉండటంతో పోలీసుల పనితీరు మందగిస్తోందనేది సర్వే సారాంశం. 24 గంటల డ్యూటీతో మంచి ఫలితాల మాటేమో గానీ దుష్ఫలితాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.

అయితే బీపీఆర్డీ నివేదిక అమలుచేయడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకమే. అయితే కమిషనరేట్లతో పాటు ఆయా జిల్లాల పరిధిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇంకా ఎంతమంది అవసరమవుతారనే విషయాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం. అవన్నీ నివేదికలు వచ్చాక 8 గంటల పని విధానం అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓవర్ టైమ్ అలవెన్సుల చెల్లింపు, వీక్లీ ఆఫ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు ఉన్నతాధికారులు. వొకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పంచాయతీ ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే ఛాన్సున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన వీక్లీ ఆఫ్ సక్సెసయినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 4 నెలల పాటు వాటిని రద్దు చేయడం గమనార్హం.