మనిషిలా నడిచే కారు..

SMTV Desk 2019-01-10 12:17:38  Hyundai, robotic cars, CES2019

లాస్‌వెగాస్‌, జనవరి 10: కారు అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వెళితే ఎలా ఉంటుంది వొకసారి ఊహించండి. ఇలాంటి సంఘటనలు కేవలం హాలీవుడ్‌ సినిమాల్లోనే సాధ్యమవుతాయి అనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజుల్లో ఇది నిజం కానుంది. ఆ దిశగా ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్‌ ముందడుగు వేసింది. ప్రతి ఏడాది వినూత్న వాహనాల ప్రదర్శన జరిగే సీఈఎస్‌–2019లో హ్యుండయ్‌ ఈ కార్ల గురించి వివరించింది. ఈ కారుల సహాయంతో కష్టసాధ్యమైన మార్గాల్లోనూ సులభంగా ప్రయాణించవచ్చని హ్యుండయ్‌ క్రెడిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ స్యూ తెలిపారు.

కాగా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ప్రజలను కాపాడటానికి ఈ కార్లు చాలా బాగా ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. ఐదు అడుగుల ఎత్తయిన గోడలను సైతం అవలీలగా ఎక్కేలా వీటిని రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ కార్లు మార్కెట్లోకి రావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.