వరుసగా రెండో రోజు భారత్‌ బంద్‌..

SMTV Desk 2019-01-09 15:58:17  Bharat Bandh, Trade unions strike, West Bengal, national wide strike

న్యూఢిల్లీ, జనవరి 9: ఎన్డియే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ రెండో రోజు కొనసాగుతోంది. కార్మిక సంఘాలు చేపట్టిన ఈ బంద్‌ బెంగాల్‌లో హింసాత్మకంగా మారింది. బెంగాల్‌లో రోడ్లపైకి వచ్చిన వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి.పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనలో ఓ బస్సు డ్రైవర్‌ త్రీవంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపున్న సీపీఎం నేత సుజన్‌ చౌదరీను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.

వామపక్షాలు, కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా 32వేల మంది కార్మికులు బంద్‌ను పాటిస్తున్నారు. కార్మికుల హక్కులకై వారు డిమాండ్‌ చేస్తున్నారు. తిరువనంతపురంలో రైలు పట్టాలపై కార్మికులు బైఠాయించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు 12 డిమాండ్‌లను ఉంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల బంద్‌కు పది ట్రేడ్‌ యూనియన్లు మద్దుతు ప్రకటించాయి.