ఐఫోన్ల సేల్స్ తగ్గుతున్నాయి...

SMTV Desk 2019-01-09 14:14:19  Apple, Sales, Less Production, January-March

జనవరి 9: యాపిల్ అమ్మకాలు తరచుగా తగ్గుతున్నాయి. గత త్రైమాసికంలో ఆశించినంత లాభాన్ని ఆర్జించలేకపోయిన యాపిల్, జనవరి-మార్చి క్వార్టర్‌లో కొత్త ఐఫోన్ల తయారీని 10% తగ్గించనుంది. గతంలో చెప్పినదాని కంటే తక్కువగా కొత్త ఐఫోన్లను తయారు చేయాలంటూ తమ సప్లయర్స్‌ను కోరింది యాపిల్ యాజమాన్యం. ఇలా యాపిల్ తమ ఉత్పత్తిని తగ్గించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. రెండు నెలల్లో ఇది రెండో సారి. గతంలో చెప్పిన 89-93 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా 84 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని మాత్రమే కంపెనీ ఆశిస్తున్నట్టు జనవరి 2న ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. యాపిల్ లాభాలు తగ్గడానికి చైనాలో ఐఫోన్ అమ్మకాలు తగ్గిపోవడం, అక్కడ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం లాంటి కారణాలున్నాయన్నది ఆ కంపెనీ వాదన.

మార్కెట్‌లో మరిన్ని కంపెనీలు ఐఫోన్ లాంటి ఫీచర్లతో తక్కువ ధరకే ఫోన్లు తయారుచేస్తున్నాయి. మిగతా ఫోన్లకు, ఐఫోన్లకు పెద్దగా తేడాలు ఉండకపోవడం, మిగతా బ్రాండ్ల ఫోన్లు ఐఫోన్ కన్నా తక్కువ ధరకే రావడంతో యాపిల్ సేల్స్ తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గినందుకే ఉత్పత్తి కూడా తగ్గించాలనుకుంటోంది. వాస్తవానికి జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 కోట్ల యూనిట్స్ తయారు చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తిని 4 కోట్లకు తగ్గించారు. జనవరి-మార్చి త్రైమాసికానికి ఉత్పత్తిని తగ్గించాలని కోరడం ఈ ఏడాది యాపిల్‌కు మరింత గడ్డు పరిస్థితులకు కారణం కావచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ లాంటి కొత్త మోడల్స్‌ ఉత్పత్తి తగ్గనుంది.