పంచాయతి ఎన్నికలకు వేలం పాట ???

SMTV Desk 2019-01-09 12:24:57  Telangana, Panchayati elections, Election commissions, TRS, KCR

హైదరాబాద్, జనవరి 9‌: తెలంగాణలో రానున్న పంచాయతి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కాగా ఈ సర్పంచ్, వార్డ్ మెంబెర్ ఎన్నికల సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఆ స్థానాలకు వేలం పాటలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం గ్రహించింది. దీనికి ఎన్నికల కమిషనర్ మంగళవారం నాడు వొక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలకు నిర్వహించే వేలం పాటలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

కాగా ఎవరైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు, పత్రికల్లో వచ్చే సమాచారంపై పరిశీలనకు జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. సాధారణ పరిశీలకుల అనుమతి తర్వాతే ఏకగ్రీవమైన పంచాయతీల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారని పేర్కొంది. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.