వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ భారత్ ముందంజ: ప్రపంచ బ్యాంక్

SMTV Desk 2019-01-09 11:57:38  World bank, india, Growth rate

న్యూఢిల్లీ, జనవరి 9: విశ్వంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశం, 2019-20లోనూ తన స్థానాన్ని నిలుపుకోనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2017-18లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతం కాగా, అయితే ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతానికి చేరుతుంది అని అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, రానున్న సంవత్సరం 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని వ్యాఖ్యానించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ (జీఈపీ)ని విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్, మరికొన్ని సంవత్సరాల పాటు భారత్ ఇదే విధమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది.

కాగా, అదే సమయంలో దక్షిణాసియాలో పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పిన వరల్డ్ బ్యాంక్, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంతో వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ప్రపంచ సగటు వృద్ధి 2.9 శాతానికి తగ్గనుందని, వచ్చే రెండేళ్లూ 2.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఉత్పత్తి రంగం నెమ్మదించడమే ఇందుకు కారణమని అభిప్రాయం వ్యక్తం చేసింది.