సీతారామ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...

SMTV Desk 2019-01-09 11:37:59  Seetharama project, Central environmental Ministry, KCR

హైదరాబాద్, జనవరి 9‌: సీతారామ ప్రాజెక్టు పర్యావరణ అనుమతిని మంగళవారం నాడు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.కర్కెట్ల నుండి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ వి.సుధాకర్‌కు లేఖ అందింది. గత సంవత్సరం నవంబర్‌ 27న జరిగిన ఈఏసి సమావేశంలో సీతరామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు,1,39,836 హెక్టార్ల స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది.

ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 2,72,921 హెక్టార్ల భూమికి సాగు నీరు అందగా పై మూడు జిల్లాల్లో దాదాపు 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తి అయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందడానికి గత సంవత్సరం ఆగస్టు నెలలో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద వొక హెడ్‌ రెగ్యులెటర్‌ని,372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్‌హౌస్‌ల నిర్మాణం, డెలివరీ సిస్టర్న్‌ నిర్మాణం, 9కిలోమీటర్ల పైప్‌లైన్‌, వాగులపై క్రాస్‌ డ్రైనేజ్‌ స్ట్రక్చర్‌, టన్నెల్లు, కాలువలపై క్రాస్‌ రెగ్యులేటర్‌లు, తూముల నిర్మాణం జరుగుతుంది.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం అంచనా వ్యయం రూ.13,384 కోట్ల 80లక్షలు, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. సాగునీటి శాఖ సమర్పించిన పర్యావరణ నివేదికను ఈఏసి కూలంకషంగా పరిశీలించిన పిదప సాగునీటి శాఖ అధికారులు ఇచ్చిన వివరణలకు సంతృప్తి చెంది ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయాల్సిందిగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. వారి సిఫార్సు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌ 2006లోకి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7న తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌కు లేఖ రాసింది.

ఈ అనుమతి పదేళ్ల వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పర్యటలో భాగంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలిసి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. మొత్తంగా కెసిఆర్‌ దౌత్యం ఫలించింది. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు ధన్యవాదాలు తెలిపారు.