ఈబీసి రిజర్వేషన్ బిల్లుపై మాజీ కేంద్ర మంత్రి తీవ్ర వ్యతిరేఖత

SMTV Desk 2019-01-08 15:43:43  TDP, Former Central minister, Sujana chowdary, Central government, BJP

అమరావతి, జనవరి 8: మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. త్వరలో జరగునున్న లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ప్రకటించిందని ఆయన ఆరోపించారు. కేవలం ఈ రిజర్వేషన్ బిల్లును ఎన్నికల్లో జిమ్మిక్కుల కోసమే తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లును బిజెపి ప్రభుత్వం రాజ్య సభలో ఎలా పాస్ చేయిస్తుందో చూడాలని...దాన్ని బట్టి వారికి ఈబిసి రిజర్వేషన్లపై వున్న చిత్తశుద్ది ఏంటో తెలుస్తుందని సుజనా చౌదరి అన్నారు. అగ్ర వర్ణాలకు చెందిన నిరుపేదలకు అన్ని రంగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తాము ముందునుంచి స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాంటిది తమ పార్టీకి చెందిన ఎంపీలను సభలో నుండి సస్పెండ్ చేసి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం విడ్డూరంగా వుందన్నారు. తమతో పాటు అన్నాడీఎంకే ఎంపీలు 40 మందిని సస్పెండ్ చేసి ఈబిసి బిల్లు తీసుకురావడం దారుణమని సుజనా ఆవేధన వ్యక్తం చేశారు.

ఈ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ అవసరమని...ఇది చాలా పెద్ద అంశమని తెలిపారు. అయితే ఎవరికీ సంప్రదించకుండా బిల్లు తీసుకువచ్చినట్లు...సవరణ బిల్లును తీసుకురావద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సుజనా చౌదరి సూచించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను కల్పించడానికి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నా...కావాలనే ఎన్నికలకు ముందు పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారని ఆరోపించారు. దీని ద్వారా ఈబీసిల్లో సానుభూతి పొందాలని బిజెపి పార్టీ భావిస్తోందని సుజనా చౌదరి పేర్కొన్నారు.