కర్నూల్ లో విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం

SMTV Desk 2019-01-08 15:32:51  Kurnool airport, Inaugurates Kurnool Greenfield Airport, AP, CM, Chandrababu

కర్నూలు, జనవరి 8: మంగళవారం కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు వద్ద నిర్మించిన విమానాశ్రయాన్ని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించిన ఆల్టా మెగా సోలార్ పార్క్ ను చంద్రబాబు జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్ర క్యాన్సర్ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఫార్మా క్లస్టర్, ఎంఎస్‌ఎంయి పార్కులకు భూమి పూజ చేసి, పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.110 కోట్ల వ్యయంతో కర్నూలు విమానాశ్రయాన్ని నిర్మించారు.

2015లో ఇచ్చిన హామీ మేరకు 2017 జూన్‌లో ఎయిర్‌పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. 1010 వేల ఎకరాల విస్తీర్ణంలో 2 వేల ఎకరాల పొడవుతో రన్‌వేను నిర్మించారు. డిసెంబర్ 31న టర్బో విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాల రాకపోకలకు కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు రావాల్సి వుంది. కేంద్రం నుంచి అనుమతులు మంజూరైన తర్వాత వేసవిలో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసును నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.