వ్యవసాయాధారిత పరిశ్రమలకు పెద్దపీట : కేటీఆర్‌

SMTV Desk 2017-07-28 13:49:35  KTR MEETS FOOD MINISTER HARSIMRAN KOUR

హైదరాబాద్, జూలై 28 : ఢిల్లీలో జరిగే ప్రపంచ ఆహార భారత్‌ (ఫుడ్‌ ఇండియా)-2017ను పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ముఖ్య అతిథిగా హాజరై పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని, వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోందని తెలిపారు అంతేకాకుండా రైతులకు మద్దతు ధర లభించకపోవడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుల మరణాలను నివారించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రలలో తెలంగాణ ముందు వరుసలో ఉందని, ఆహార శుద్ది పరిశ్రమలకు తెలంగాణ కేంద్రంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి, అన్నదాతకు అండగా నిలిచేందుకు పెద్దపీట వేసిందని, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాక కోటి ఎకరాల సాగు లక్ష్యంతో నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధా ప్రసాద్‌, సీఐఐ పూర్వ అధ్యక్షుడు సురేష్‌ నాయుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రంజన్‌, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.