మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు..

SMTV Desk 2019-01-08 12:51:37  Narendra Modi, Trump, Phone call

అమెరికా, జనవరి 8: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని నిర్ధారించిన వైట్ హౌస్, ఇరు దేశాల మధ్య వాణిజ్యలోటు తగ్గించడం, ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న పరిస్థితి తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు పేర్కొంది. "కొత్త ఏడాదిలో ఇరు దేశాల మధ్యా ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నేతలు నిర్ణయించారు. భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్యలోటును తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వారు చర్చించారు. ఇండో - పసిఫిక్ రీజియన్ లో శాంతి, ఆఫ్గన్ కు సహకారం తదితర అంశాలపైనా వారు మాట్లాడుకున్నారు" అని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, భారత దేశం నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ పన్నులను పెంచిన తరువాత, రెండు దేశాల మధ్యా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇండియా సైతం దీటుగా స్పందించింది. జనవరిలోగా పెంచిన సుంకాలను తగ్గించకుంటే తామూ ప్రతీకార సుంకాలను వేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఫోన్ చేయడం గమనార్హం.