ఇందిరాగాంధీపై బీజేపీ నేత ప్రశంసలు..

SMTV Desk 2019-01-08 11:55:05  Indira gandhi, nitin gadkari, positive comments

నాగపూర్, జనవరి 8: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రసంగిస్తున్న సందర్భంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు. నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మహిళా రిజర్వేషన్ల హోదా పొందకుండానే మగవారి మధ్య మేటి నేతగా ఆనాడు ఇందిరాగాంధీ తన సత్తా చాటుకున్నారని ప్రశంసలు కురిపించారు. ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందకుండానే ఆమె తన పాలన సాగించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన మహిళా నేతలు వసుంధర రాజే, సుష్మా స్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే రాజకీయాల్లో గొప్ప నేతలుగా దూసుకెళ్తున్నారని కొనియాడారు. ఎటువంటి వారైనా తమ ప్రతిభ ఆధారంగానే రాణించాలి తప్ప, కులమతాలు, ప్రాంతం, భాష వంటి అంశాలను ఆధారం చేసుకుని కాదన్న గడ్కరీ, మహిళా రిజర్వేషన్ కు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులమతాల ఆధారంగా చేసే రాజకీయాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు.