తెరాసలోకి మరో ఎమ్మెల్యే

SMTV Desk 2019-01-08 11:11:28  TRS Party, KTR, Ramagundam MLA, Korukanti chander

రామగుండం, జనవరి 8: గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పార్టీలోకి అనేక మంది నేతలు, కార్యకర్తలు వలస వెల్లుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వాతంత్ర్యంగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలల్లో వొకరు ఇదివరకే తెరాస కండువా కప్పుకోగా తాజాగా మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కరీంనగర్ జిల్లా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన సోమవారం తన అనుచరులతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షం‌లో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఆ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ తో పాటు అతడి అనుచరులకు కేటీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.



ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఓడిపోయినా... అదే పార్టీకి చెందిన చందర్ గెలవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రామగుండం ప్రజలు తెలివిగా ఆలోచించి ఓటేశారని...టీఆర్ఎస్ అభ్యర్థిని తిరస్కరించి అలాగే కాంగ్రెస్ ను కూడా గెలిపించలేదన్నారు. ఆ సీటు ప్రజలు ఈ ఎమ్మెల్యే(చందర్)కు అప్పగించారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చందర్ చురుకుగా పాల్గొన్నారని కేటీఆర్ ప్రశంసించారు. అలాగే సింగరేణి ఎన్నికల్లోనూ కూడా అతడు టీఆర్ఎస్‌ను గెలిపించాడని గుర్తు చేశారు. ఇక అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకుందామని కేటీఆర్ సూచించారు.



అంతేకాకుండా రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇస్తూ త్వరలోనే ఆ హామీ నెరవేర్చుతామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చందర్, సోమారపు సత్యనారాయణ కు కలిసి లక్షకు పైగా ఓట్లు వచ్చాయని... పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ ఓట్లు టీఆర్ఎస్ కే పడేలా ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ నియోజకవర్గానికి అభివృద్ది బాధ్యతలను తానే వ్యక్తిగతంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.