టీఆర్ఎస్ లోకి సర్వే సత్యనారాయణ ...???

SMTV Desk 2019-01-07 17:49:48  Telangana congress party, Sarve sathyanarayana, Suspended, Uttam kumar reddy, TRS

హైదరాబాద్, జనవరి 7: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణను కాంగ్రెస్ పార్టీ ఆదివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తనపై క్రమశిక్షణాపరమైన చర్య తీసుకోవాలంటే హైకమాండ్‌కే అధికారం ఉందన్నారు. సోనియా, రాహుల్ లేదంటే ఏకే ఆంటోనీకే తనపై చర్య తీసుకునే అధికారం ఉందని సర్వే తెలిపారు. కేవలం నిలదీసినందుకే తనను టార్గెట్ చేశారని, వారి వల్లే పార్టీ నష్టపోయిందని సత్యనారాయణ అన్నారు.

ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోందన్నారు. గాంధీ కుటుంబానికి తాను విధేయుడినని, తనకు రాజకీయ జన్మ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని సర్వే ప్రకటించారు. ఎన్నికల్లో ఓడించేందుకు ఉత్తమ్ కుట్రలు చేశారని, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు విడుదలు చేసిందని, దానితో పాటు టీపీసీసీ సైతం డబ్బు వసూలు చేసిందని ఆయన తెలిపారు. తనకు మందీమార్బాలం ఉందని, రౌడీయిజం, దాదాగిరి తాను చేయగలనని సర్వే హెచ్చరించారు.

అంతేకాక పార్టీపరంగా ఎలాంటి పదవులు ఇచ్చినా, కార్యక్రమాలు జరిపినా ఏఐసీసీ నుంచి రాహుల్ గాంధీ అప్రూవ్ చేసినట్లు లేఖ వస్తుందని మరి రివ్యూ మీటింగ్ పెట్టమని ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని సర్వే డిమాండ్ చేశారు. చివరికి మీడియాకు సైతం ఎలాంటి అనుమతి పత్రం చూపించలేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. నన్ను సస్పెండ్ చేసినట్లు ఆధారంగా ఏమైనా లెటర్స్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. తాను ఎక్కడ దళితకార్డ్ వాడలేదని స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగానని సర్వే చెప్పారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు.

జనరల్ సీటులో దళిత అభ్యర్థిగా పోటీ చేసి మల్కాజ్‌గిరిలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందానని సత్యనారాయణ గుర్తుచేశారు. ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతీసేందుకు టీపీసీసీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి, నియమ నిబంధనల గురించి తెలియని వారు పెద్దలుగా చలామణీ అవుతున్నారని అన్నారు. దళితబిడ్డనైన నేను గెలిస్తే పార్టీ మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రిని అవుతాననే భయంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నేతలకు ఫోన్ చేసి తనను ఓడించాలని ఆదేశాలిచ్చారని సర్వే విమర్శించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంపై రాష్ట్రంలో చాలా మంది కార్యకర్తలు, నేతలు వ్యతిరేకతతో ఉన్నారన్నారని, టీఆర్ఎస్ పార్టీతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, భట్టిని సైతం ఓడించేందుకు ఉత్తమ్ కుయుక్తులు పన్నారని ఆరోపించారు. దారినపోయే దానయ్యలకు జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. నిన్నటి సమావేశంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిని ఉత్తమ్ కుమార్ వారించలేదని తెలిపారు. పూటకు గడవని వాళ్లను జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా నియమించుకుని ఉత్తమ్ పెత్తనం చెలాయిస్తున్నారని సర్వే ఎద్దేవా చేశారు. ఆయన నాయకత్వంలో చాలామందికి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. తాను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌నేనని, ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్లు వస్తారని సత్యనారాయణ జోస్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠావ్.. తెలంగాణ కాంగ్రెస్ బచావ్ అంటున్నారని కార్యకర్తలు తనకు మద్ధతుగా నిలుస్తున్నారి సర్వే తెలిపారు.

ఇకపోతే ఇప్పుడు సర్వే టీఆరెస్ లోకి చేరతాడ లేక మళ్ళీ కాంగ్రెస్ లోనే అడుగుపెడతారా అని అనేక వార్తలు వస్తున్నాయి. సర్వే మాత్రం టీఆరెస్ కి అనుగుణంగానే మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్లుగా పార్టీకి సేవ చేసినా తనను అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ పెద్దల తీరును ఎండగడుతూనే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబసభ్యుల పనితీరును ఆకాశానికెత్తేశారు. ఎన్నికల్లో విజయానికి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కష్టపడిందని ప్రశంసించారు. టీపీసీసీ నేతలకు ఉపన్యాసాలు ఇవ్వడం రాదని, కనీసం మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లడంలోనూ విఫలమయ్యారంటూ సర్వే మండిపడ్డారు.

ఉత్తమ్‌తో పాటు అగ్రనేతలంతా ప్రచారంలో వేగంగా దూసుకెళ్లలేదని, కానీ కేసీఆర్ ఆ వయసులోనూ రోజుకు 5 సభల్లో పాల్గొంటూ వొక్కరే సుడిగాలి పర్యటనలు చేశారని సత్యనారాయణ కొనియాడారు. ఎన్నికల్లో గెలిచామని, అధికారంలోకి వచ్చామని కేసీఆర్ ఆయన కుటుంబం వొక్క క్షణం కూడా ఖాళీగా లేరని, ఇంకా కష్టపడుతున్నారని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రతిరోజూ గాంధీభవన్‌కు వచ్చి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే టీపీసీసీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న సర్వే.. ఈ వ్యాఖ్యల ద్వారా తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు చెప్పకనే చెప్పారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.