పోలవరానికి గిన్నీస్ రికార్డు...???

SMTV Desk 2019-01-06 18:06:46  Polavaram project, Andhrapradesh, CM, Chandrababu, Gunnis book

అమరావతి, జనవరి 6: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని గేట్ల పనులను ఈ మధ్యే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకి మరో అరుదైన రికార్డు సాధించేందుకు నిర్మాణ సంస్థ, అధికారులు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ ఛానెల్‌లో 24 గంటల పాటు నాన్‌స్టాప్ కాంక్రీట్ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ పనులు సోమవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగనున్నాయి.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దీనిని నమోదు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధి అక్కడకు చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ ఎండీ బి.శ్రీధర్ తెలిపారు. 2017లో దుబాయ్‌లో వొక టవర్ నిర్మాణానికి 36 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారని, ఇప్పుడు దీనిని అధిగమించేందుకు కేవలం 24 గంటల్లోనే 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గిన్నిస్‌బుక్ ప్రతినిధులు 24 మంది ఈ కాంక్రీటు పనులను ప్రతి 15 నిమిషాలకోసారి నమోదు చేసుకుంటున్నారు.