పంచాయితీ ఎన్నికల్లో పోటీ దారులకు సూచనలు

SMTV Desk 2019-01-05 19:37:01  Telangana panchayat elections, Election commission, Sarpanch, Ward members

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలో రానున్న పంచాయితీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్దులకు ఎన్నికల సంఘం పలు సూచనలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భద్రతా మరింత పటిష్టంగా చేస్తున్నామని వెల్లడించారు. *సర్పంచ్, వార్డు మెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు ఉండి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
* ఏదేని గ్రామ సేవకులు (నీరడి, కావల్కర్, సేత్‌సింధి స్థానికంగా ఏదేని పేరుతో పిలువబడే గ్రామ పంచాయతీ సిబ్బంది), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగులు అనర్హులు. ప్రభుత్వ నిధుల నుంచి సాయం పొందుతున్న ఏదేని సంస్థలోని ఉద్యోగి, శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభలు ఏర్పాటు చేసిన చట్టం కింద ఏర్పాటైన ఏదైనా సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు, ఉద్యోగి వీరిలో ఎవరు కూడా పోటీకి అనర్హులు.
* ప్రజాప్రతినిధి చట్టం కింద ఏదేని నేరానికి శిక్ష పడిన వ్యక్తి, శిక్ష విధించిన తేదీ నుంచి 6 సంవత్సరాల కాల పరిమితి వరకు పోటీకి వీలు లేదు.
* పౌర హక్కుల చట్టం కింద నేరానికి, నైతిక అపరాధంతో కూడిన నేరానికి శిక్ష విధించిన తేదీ నుంచి 5 సంవత్సరాల కాల పరిమితి వరకు లేక అతడికి జైలు శిక్ష విధించబడి ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు ముగింపు నుంచి 5 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి అనర్హులు.
* మతి స్థిమితం లేకపోవడం, దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి, రుణ విమోచన పొందని దివాళాదారులు కూడా అనర్హులు.
* నగర పంచాయతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో సభ్యులు, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల నుంచి జీతం పొందే న్యాయవాది, ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు.
* రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం కంటే ఎక్కువ చెల్లించిన వాటా మూలధనం గల ఏదేని కంపెనీ లేక కార్పొరేషన్‌లో మేనేజర్, కార్యదర్శిగా పని చేసే వ్యక్తి అనర్హుడు.
* భారత శిక్షాస్మ్రతి 9ఏ విభాగం కింద ఏదేని నేరానికి శిక్షించబడిన వారు, లంచం, దుష్ప్రవర్తనకు పాల్పడటంలో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్న వారు కూడా అనర్హులు
* గతంలో ఎన్నికల్లో పోటీ చేసి నిర్ణీత గడువులో ఖర్చుల లెక్కలను దాఖలు చేయడంలో విఫలమైన వారు, పంచాయతీకి సంబంధించిన విధుల నిర్వహణ కార్యాచరణలో విఫలమైన సందర్భాల్లో పదవి నుంచి తొలగించబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులు ఆరు సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదు.
* కులం, మతం, జన్మస్థలం, నివాసం, భాష తదితర కారణాలతో నేరం ఆరోపించబడిన వ్యక్తులు విదేశీ మాదకద్రవ్యం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పౌర హక్కుల చట్టం పరిరక్షణ పాటించకపోవడం, కస్టమ్స్‌చట్టం నార్కొటెక్ డ్రగ్స్, సైకో ట్రాఫిక్ చట్టం, తీవ్రవాద చర్యలు, మతపరమైన సంస్థల కార్యక్రమాల్లో ఉంటే అనర్హులుగా ప్రకటించబడతారు.
* అక్రమాస్తులు, అక్రమ సంపాదన నివారణ చట్టం, ఆహారం, మందుల కల్తీకి సంబంధించిన చట్టం, వరకట్న నిషేధ చట్టంలో నిబంధనలు ఉల్లంఘించి ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధింపు తేదీ నుంచి అనర్హులవుతారు. వారి శిక్ష కాలం అనంతరం విడుదలైన తరువాత 6 సంవత్సరాల వరకు పోటీకి అనర్హులు.