ప్రయాణంలో వాంతులు రాకుండా ఏం చెయ్యాలి?

SMTV Desk 2019-01-05 18:35:45  Travel, Uneasy, Precautions

బస్సులు, కార్లు వంటి వాహనాల్లో ప్రయాణించే వారికి మార్గమధ్యలో అజీర్తీతో వాంతులు అవుతుంటాయి. ఇది సహజమే. ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసే వారికి వాంతులు వస్తుంటాయి. కొందరికి విమానాల్లో, మరికొందరికి ట్రెయిన్లలో ఇలా జరుగుతుంటుంది. అయితే ప్రయాణంలో వాంతులు కాకుండా ఉండాలంటే.. అందుకు కింద తెలిపిన పలు చిట్కాలు పాటించాలి.


1. ప్రయాణానికి ముందు అల్లం రసం సేవించాలి. లేదా మార్గమధ్యలో ఉన్నా అల్లం టీ తాగాలి. అల్లం వల్ల ప్రయాణంలో వికారం రాకుండా ఉంటుంది. దీంతో వాంతులు రాకుండా ఆపవచ్చు.

2. పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా ప్రయాణంలో వాంతులు రాకుండా ఆపవచ్చు.

3. నిమ్మకాయ పై పొట్టు తీసి కొద్ది కొద్దిగా రసం చప్పరించాలి. లేదా నిమ్మరసం సేవించాలి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయాణంలో వాంతులు రాకుండా చూసుకోవచ్చు.

4. వాహనాల్లో చివరి సీట్లలో కూర్చోరాదు. ప్రయాణంలో ఉన్నప్పుడు వేగంగా వెళ్తున్న వాహనం నుంచి బయటకు చూశాక పుస్తకాలు చదవరాదు. అలా చేస్తే కళ్లకు వొకరకమైన ఫీలింగ్ కలుగుతుంది. అది వాంతిని కలగజేస్తుంది.

5. ప్రయాణంలో ఉన్నప్పుడు మద్యం సేవించడం, పొగ తాగడం చేయరాదు. అవి వాంతులకు మరింత కారకాలు అవుతాయి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినరాదు.

6. ప్రయాణానికి ముందు ఆహారం తినరాదు. తినాల్సి వస్తే కొంచెం తీసుకోవాలి. కడుపు నిండా పట్టేట్లుగా భుజించరాదు. అలా చేస్తే ప్రయాణంలో వాంతులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

7. వాహనంలో వచ్చే పెట్రోల్, డీజిల్ వాసన, ఇతర వ్యక్తుల చెమట వాసన కలిపి వొక్కోసారి వాంతులు వస్తాయి. అలాంటప్పుడు సువాసన వచ్చే పువ్వులను వాసన పీల్చాలి. లేదా వాహనం విండోలో నుంచి బయటకు తల పెట్టి తాజా గాలి పీల్చుకోవాలి. ఇంకా సమస్య ఉంటుందనుకుంటే ప్రయాణానికి ముందే డాక్టర్‌ను కలిసి ట్యాబ్లెట్లను తీసుకోవడం ఉత్తమం.