ప్రజారాజ్యం విలీనంపై స్పందించిన పవన్

SMTV Desk 2019-01-05 16:15:25  Chiranjevi, Pawan kalyan, Prajarajyam party, Janasena party

అమరావతి, జనవరి 5: మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీనం పై కారణాలను తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలతో పంచుకున్నాడు. అమరావతిలో ప్రకాశం జిల్లా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జనసేన కమిటీలు వేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కొందరు కార్యకర్తలు సూచించారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల వల్ల తాను జనసేన కమిటీలు వెయ్యడం లేదని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ అంటూ వస్తున్న వార్తలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజారాజ్యం పార్టీ అలా కావడానికి గల కారణాలను వివరించారు జనసేనాని. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చెయ్యాలని చిరంజీవిపై వొత్తిడి తెచ్చిన వారిలో తాను ఉన్నానని చెప్పుకొచ్చారు.

ఓపిక లేని నాయకుల వల్లే తన అన్న పార్టీ పరిస్థితి అలా తయారైందని స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలో చేరిన కొందరు నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని పవన్ స్పష్టం చేశారు. అందువల్లే ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైందని తెలిపారు. అలాంటి పరిస్థితి జనసేనకు రాకూడదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 60 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చెయ్యాలని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటన తనకు సంతృప్తి ఇవ్వలేదని రాజకీయ పార్టీ పెట్టినప్పుడే సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే రూ.2000 కోట్లు అవసరమని కొందరు అంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే డబ్బు అంత ప్రధానం అయిపోయిందా అంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.