నగరంలోకి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

SMTV Desk 2019-01-05 12:33:18  Hyderabad, Electri buses, GHMC, TSRTC

హైదరాబాద్, జనవరి 5: నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నివారించే ప్రయత్నాలలో భాగంగా టీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ (ఛార్జింగ్) బస్సులను ప్రవేశపెడుతోంది. అందుకోసం అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపించేందుకు వొక ప్రవేట్ సంస్థతో వొప్పందం చేసుకొంది. మొదటిదశలో 40 ఎలక్ట్రిక్ (ఛార్జింగ్) బస్సులు ప్రవేశపెడుతోంది. వాటిలో మియాపూర్, కంటోన్మెంట్ డిపోలకు చెరో 20 బస్సులను కేటాయించారు. ఆ డిపోలలోనే రెండు భారీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొన్ని మార్గాలలో ఆ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపించి చూస్తున్నారు. పనిలో పనిగా ఆర్టీసీ డ్రైవర్లతో వాటి పనితీరును పరీక్షింపజేయిస్తున్నారు. ఈ బస్సులు ఎటువంటి శబ్ధమూ, కాలుష్యం వెదజల్లకుండా పరుగులు తీస్తుండటాన్ని నగర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే వీటి టికెట్ ఛార్జీలు, ఏసీ బస్సు టికెట్ ఛార్జీలతో సమానంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ ఎలక్ట్రిక్ (ఛార్జింగ్) బస్సులు ఈ హైదరాబాద్‌ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.