ఈనెల 14వ తేదిలోపు బూత్ కమిటీలను పూర్తి చేయాలి : ఉత్తమ్

SMTV Desk 2019-01-04 19:37:45  Congress party, Uttam kumar reddy, DCC, Election booth comity

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామాకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమర్థులైన వారికి ఈ భాద్యతలను అప్పగించాలని భావిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు.

డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయమై చర్చించారు. జనవరి 14వ తేదీ లోపుగా బూత్, మండల, బ్లాక్ స్థాయి కమిటీలను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఇటీవల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు సిఫారసు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమిష్టిగా పనిచేయాలని ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు. ఓటర్ల నమోదు కోసం ఈసీ జనవరి 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఓటర్ల నమోదులో కాంగ్రెస్ పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆదేశించారు.