జగన్ ప్రజాసంకల్ప యాత్రకు చిహ్నంగా భారీ స్థూప నిర్మాణం

SMTV Desk 2019-01-04 18:18:41  YSRCP, YS Jagan mohan reddy, Praja sankalpa yatra, Statue

శ్రీకాకుళం, జనవరి 4: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తుది ఘట్టానికి దగ్గరలో ఉంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ప్రారంభించిన ఈ పాదయాత్ర 13వ జిల్లాలో పూర్తి చేసుకోబోతుంది. అప్రతిహాతంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రలో జగన్ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు తాము అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కారిస్తామనే అంశాలపై జగన్ చెప్పుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగారు.

దాదాపు సంవత్సరం 2నెలలపాటు అంటే 14నెలలపాటు జరిగిన ఈ పాదయాత్ర 2019 జనవరి9న ముగియనున్న విషయం తెలిసిందే. జనవరి 9వరకు వైఎస్ జగన్ 13 జిల్లాలలో 341 రోజులుపాటు కొనసాగుతున్న యాత్రలో 3,648 కిలోమీటర్ల మేర నడిచే అవకాశం ఉంది. మెుత్తం రాష్ట్రవ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతుంది. పాదయాత్ర ఆద్యంతం 231 మండలాల్లో 2,516 గ్రామాల మీదుగా విజయవంతంగా కొనసాగింది. 54 మున్సిపాల్టీలు, 8 నగర పాలక సంస్థలను కవర్ చేసేలా ఈపాదయాత్ర రూపుదిద్దుకుంది. 341 రోజుల పాదయాత్రలో వైఎస్ జగన్ 124 బహిరంగ సమావేశాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు.

అయితే ప్రజా సంకల్పయాత్ర ముగింపుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాసంకల్పయాత్రకు ప్రతీకగా ఇచ్చాపురంలో భారీ పైలాన్ ను ఏర్పాటు చేసింది. జగన్ పాదయాత్ర విశేషాలను వివరించేలా గ్రానైట్ పలకలపై అద్భుతమైన డిజైన్స్ తో పొందుపరిచారు. పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పడంతోపాటు చిరస్థాయిగా నిలిచిపోయేలా పైలాన్ ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకిచ్చిన భరోసలను గుర్తుకు తెచ్చేలా స్థూపాన్ని నిర్మిస్తోంది వైసీపీ. మరికొద్ది రోజుల్లోనే పాదయాత్రా ముగింపు దశకు చేరుకోవడంతో పైలాన్ పనులను సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు వైసీపీ శ్రేణులు.

ఇచ్చాపురంలో ఏర్పాటు చేస్తున్న ఈ పైలాన్ కు ఎంతో విశిష్టత ఉందని ఆపార్టీ స్పష్టం చేస్తోంది. ఇచ్చాపురానికి 2 కిలోమీటర్ల దూరంలో బహుదానది తీరాన ఈ స్థూపం రూపుదిద్దుకుంటోంది. ఈ స్థూపాన్ని పాదయాత్ర ఆఖరి రోజున వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.ఇచ్చాపురం నియోజకవర్గంలోనే పైలాన్ ఏర్పాటు చెయ్యడానికి కూడా కారణాలు లేకపోలేదు. దివంగత సీఎం వైఎస్ ఆర్ చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగిసింది. వైఎస్ఆర్ ప్రజాప్రస్థానానికి గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు.

వైఎఆర్ తర్వాత వైసీపీ నేత ఆయన తనయ వైయస్‌ షర్మిళ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా మరో స్థూపాన్ని నిర్మించారు. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగియనుంది. ఇకపోతే ఈ స్థూపాన్ని మూడు అంతస్తుల మేర నిర్మించారు. పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్‌ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉంటుంది.

మొదటి అంతస్తులో వైఎస్ జగన్‌ పాదయాత్ర ఫొటోలు ఉండగా...రెండో అంతస్తులో మహానేత వైఎస్ఆర్ ఫొటోలు ఉండేలా ఏర్పాటు చేశారు. చివరి అంతస్తు వృత్తాకార ఆకృతిలో ఉంటుంది. చివరి అంతస్తు డోమ్‌ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని పెడుతున్నారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్రహరీగోడపైన పాదయాత్ర విశేషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు వైసీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం స్పష్టం చేశారు. స్థూప నిర్మాణంలో గెలాక్సీ గ్రానైట్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈగ్రానైట్‌ పలకలపై పాదయాత్ర ఫొటోలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ముద్రించినట్లు రఘురాం చెప్పారు.