జగన్ కేసుపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-01-04 17:50:35  YSRCP, MLA, Ramakrishna reddy, YS Jagan mohan reddy, Chandrababu, DGP, RP Takur

అమరావతి, జనవరి 4: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై విశాఖలో జరిగిన కోడికత్తి దాడిపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోడికత్తి దాడి కేసును సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ లు ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు హైకోర్టు అప్పగించడాన్ని ఆయన స్వాగతించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారని, ఏపీ డీజీపీకి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు వొత్తిడి చేసి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూశారని మండిపడ్డారు. సీఎం, డీజీపీ కలిసి కేసును నీరుకార్చే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. 12.30 గంటలకు హత్యాయత్నం జరిగితే సాయంత్రం వరకు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారంటూ మండిపడ్డారు. డీజీపీ చేసిన తప్పులు ఎన్‌ఐఏ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

విచారణ చేపట్టకముందే కథ అల్లి డీజీపీ చెప్పడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. హత్యాయత్నం వెనక ఉన్నవాళ్లను ఎన్‌ఐఏ ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. నిందితులకు శిక్షలు పడితీరుతాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావుపై కూడా ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జగన్ పై దాడి వెనుక సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నారని తెలియడంతో నిందితుడు వాస్తవాలను బయటకు తీస్తారన్న భయంతో చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాసరావుకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకుని శిక్షించాలంటే శ్రీనివాసరావు ప్రాణాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.