జగన్ మోడీ పాదాలు తాకుతున్నాడు : డిప్యూటి సీఎం

SMTV Desk 2019-01-04 17:28:23  AP, Deputy CM, Kambalapadu Ediga Krishnamurthy, YSRCP, YS Jagan mohan reddy, TDP

కర్నూలు, జనవరి 4: జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం కుర్చీ కోసం మోడీ పాదాలు మొక్కుతున్నారు అని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఏనాడూ అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సమస్యలపై అధికార పక్షానికి సలహాలు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఏళ్ల తరబడి బజార్లు పట్టుకుని తిరుగుతున్నాడే తప్ప ప్రజా సంక్షేమం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

బజార్లు పట్టుకు తిరిగే నాయకుడుకి సీఎం కుర్చీ అవసరమా అంటూ ప్రశ్నించారు. సీఎం కుర్చీ కోసం మోదీ పాదాలు మొక్కి ఆయన ప్రాపకం కోసం ప్రాధేయపడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వద్దని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించి దిక్కులేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు. అలాంటి సమయంలో రాష్ట్రాన్ని ఆదుకుంటాడన్న భరోసాతో నరేంద్రమోదీకి టీడీపీ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. మోదీకి జగన్‌తో చీకటి వొప్పందం ఉండటంతో రాష్ట్రంపై కక్ష కట్టి నిధులు మంజూరులో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.