కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ సెటైర్ల వర్షం ....

SMTV Desk 2019-01-04 16:53:32  TRS, KTS, Congress party, TRS Bhavan

హైదరాబాద్, జనవరి 4: శుక్రవారం టీఆరెస్ భవన్ లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో తెరాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలకు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. అంతేకాక స్థానికంగా ఉన్న వాస్తవాలను, ప్రజల ఆలోచనను గుర్తించకుండా తమ కూటమిదే విజయమని విర్రవీగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవమాన పాలయింది అంటూ హేళన చేశారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని భావించిన ఆ పార్టీ నేతలు, నాయకులూ మంత్రి పదవులను కూడా పంచుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లవద్దని కేసీఆర్ కు చాలా మంది సూచించారని కానీ ఆయన ఎవరి మాటా వినకుండా ముందుకెళ్లారని గుర్తు చేశారు.

ప్రజానాడి తెలిసిన నాయకుడు కాబట్టే ఆయన అలా అంత దైర్యంగా ముందస్తుకు వెళ్ళి విజయం సాధించారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవం వస్తుందని ప్రచారం చేసుకున్నారని దానికి జవాభిస్తూ తాను శబ్ధ విప్లవమే వస్తుందన్నానని గుర్తు చేశారు. తాను అన్నట్లుగానే ప్రజలు భారీ శబ్ద విప్లవాన్ని సృష్టించారన్నారు. ఈ దెబ్బకు కొందరు కాంగ్రెస్ నాయకులు మీడియాకు ముఖం చాటేశారని మరింకొందరు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కు సిద్దమయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం ట్రక్కు గుర్తు వల్లే కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ గెలుపొందాడని కేటీఆర్ అన్నారు. ఇక మిగతా పార్టీలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయని జాతీయ పార్టీగా చెప్పుకునే బిజేపీ అయితే వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. పంచాయితీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కనీసం పోటీచేసే పరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.