వంద ఏళ్ళ నాటి గ్రంథాలయం

SMTV Desk 2019-01-04 16:40:31   Research Institute, Bhandarkar, pune, 100 Years

పుణెలో 100 సంవత్సరాలు దాటిన భవనం.. అందులో వందల ఏళ్ల కిందటి గ్రంథాలు.. వాటి సంఖ్య రెండున్నర లక్షల పైనే ఉంటుంది, అన్నీ అరుదైన పుస్తకాలే. అందులో ఎక్కువ భాగం రాత ప్రతులే! పురాణాలకు సంబందించిన సమాచారం అంతా అక్కడుంది. సనాతన సంపదనంతా తనలో భద్రపరుచుకున్న ఆ గ్రంథాలయం ఓరియెంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (బీఓఆర్‌ఐ). దక్షిణాసియాలో అతిపెద్ద గ్రంథాలయాల్లో వొకటైన దీనిని 1917లో నెలకొల్పారు. 19వ శతాబ్దికి చెందిన ప్రముఖ మేధావి రామకృష్ణ గోపాల్‌ భండార్కర్‌ దీనిని స్థాపించారు.

భండార్కర్‌ తన జీవిత కాలంలో సేకరించిన అతి పురాతన గ్రంథాలు, రాత ప్రతులను ఈ గ్రంథాలయంలో ఉంచారు. వీటిలో చాలావరకు సంస్కృత భాషకు చెందినవే ఉండటం విశేషం. ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ జీర్ణావస్థకు చేరుకోవడంతో.. నిర్వాహకులు గ్రంథాల డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ప్రయత్నంలో భాగంగా తొలుత 20వేల గ్రంథాల డిజిట‌లైజేషన్‌ పూర్తయింది. రెండేళ్లుగా 15 మంది సభ్యుల బృందం 3 షిఫ్టులలో పనిచేస్తూ సుమారు మూడు లక్షల ప్రతులను స్కానింగ్‌ చేశారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్కానింగ్‌ చేసిన గ్రంథాలను ఎప్పటికప్పుడు ఈ-లైబ్రరీలో ఉంచుతున్నారు. రానున్న రోజుల్లో.. గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలనూ స్కానింగ్‌ చేసి, భావితరాల కోసం భద్రపరుస్తామంటున్నారు నిర్వాహకులు. 2007లో సాంస్కృత్య మంత్రిత్వ శాఖ ఈ గ్రంథాలయానికి ఋగ్వేద మనుస్క్రిప్టును భద్రపరిచినందుకు యునెస్కో మెమరీ అఫ్ వరల్డ్ రిజిస్టర్ లో నమోదు చేసారు.