'పంచాయితీ ఎన్నికలకు మంత్రి వర్గ విస్తరణకు సంబందం లేదు'...!!!

SMTV Desk 2019-01-04 16:11:51  Telangana, Panchayati elections, Election commissions, TRS, KCR

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు పంచాయితీ ఎన్నికలు అడ్డం కాదని తెలంగాణ ఎన్నికల అధికారి వెల్లడించారు. గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి అదే నెలలో ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాని మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. కాగా అనుకున్న విధంగానే ఈ లోపు పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ ఎన్నికల వల్ల మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతుందని రాజకీయాల్లో చర్చించుకున్నారు. అయితే దీనిపై ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. పంచాయితీ ఎన్నికలకు మంత్రి వర్గ విస్తరణకు సంబంధం లేదన్నారు. దీంతో ఫిబ్రవరిలోనే జరుగుతుందనుకున్న విస్తరణ మళ్లీ ఈ నెలలో జరగవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఫలితాలు వచ్చి 20 రోజులు దాటింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత విస్తరణ ఉంటుందని భావించారు. కానీ మంచి రోజులు లేవన్న కారణంతో విస్తరణ వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం. ఆ వెంటనే విస్తరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జనవరి 30 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ కారణంగా పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరణ ఉండదనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం కోడ్‌కు, విస్తరణకు సంబంధం లేదని తేల్చాయి.