సచిన్ ను ప్రభుత్వానికి దూరంగా ఉండమన్న శివసేన..

SMTV Desk 2019-01-04 15:56:04  Sachin tendulkar, Ramakanth achrekar, Sivasena

ముంబై, జనవరి 4: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్(87) బుధవారంనాడు ముంబైలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఈ కార్యక్రమానికి సచిన్, వినోద్ కాంబ్లీలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. కాగా, అచ్రేకర్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

పద్మశ్రీ, ద్రోణాచార్య లాంటి గొప్ప పురస్కారాలను అందుకున్న వ్యక్తికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. అచ్రేకర్ పట్ల ప్రభుత్వం అగౌరపూర్వకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ సచిన్ టెండూల్కర్ దూరంగా ఉండాలని సూచించారు. ఈ అంశంపై మహారాష్ట్ర మంత్రి ప్రకాశ్ మెహతా మాట్లాడుతూ, కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే తప్పిదం జరిగిందని తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని అన్నారు. అచ్రేకర్ అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఈయన హాజరయ్యారు.