622 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్

SMTV Desk 2019-01-04 15:46:20  India, Australia, Last test, Sydney

సిడ్నీ, జనవరి 4: ఆస్ట్రేలియాలో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి నాలుగో టెస్ట్ లో భారత్ పట్టుబిగించిందనే చెప్పాలి.

సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యతతో ఉన్న భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి తొలి సారి సిరీస్ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. భారత్ ఇన్నింగ్స్ లో పుజారా 193, రిషభ్ పంత్ 159 నాటౌట్, మయాంక్ అగర్వాల్ 77, రవీంద్ర జడేజా 81 రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 4, హాజల్ వుడ్ 2 స్టార్క్ వొక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా వచ్చి, ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు.