పూజార మారథాన్ ఇన్నింగ్స్ ...

SMTV Desk 2019-01-04 11:39:56  Team india, Australia, Test match,Sydney, Chateshwar pujara

సిడ్నీ, జనవరి 4: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా వెళ్లి 130వ ఓవర్లో నాథన్‌ వేసిన చివరి బంతిని ఆడి(193) అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం పూజార వొక్కడే 62.1 ఓవర్లు ఆడడం విశేషంగా మారింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు ప్రస్తుతం క్రీజులో పంత్‌ (159: 189 బంతులు ), జడేజా(82:113బంతులు ) ఉన్నారు. 130 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 489 పరుగులు చేసింది. గురువారం ఆఖరి సెషన్‌లో పుజారాకి సహకారం అందించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (42: 96 బంతుల్లో 5ఫోర్లు) శుక్రవారం జట్టు స్కోరు 329 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా మరో 65 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్‌ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే 39 వ్యక్తిగత స్కోరుతో క్రీజులోకి వచ్చిన విహారి మాత్రం మరో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్పిన్నర్ లయన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ కోసం విహారి యత్నించగా బ్యాట్ అంచున తాకిన బంతి షార్ట్‌లెగ్‌లో గాల్లోకి లేచింది. దీంతో అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నస్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా పుజారాతో సమానంగా హిట్టింగ్ చేశాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్‌ మిచెల్ స్టార్క్‌ని లక్ష్యంగా చేసుకుని అతను రెండు బౌండరీలు బాదడం విశేషం.