చంద్రబాబు విదేశి పర్యటనపై మోడీ వేటు...!!!

SMTV Desk 2019-01-04 10:56:35  Chandrababu, Narendra modi, Central Government, International tours, TDP, BJP, Switzerland, World economic forum

అమరావతి, జనవరి 4: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశి పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు వెళ్లడాన్ని చంద్రబాబు ఆనవాయితీగా పెట్టుకున్నారు. అక్కడ వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అవకాశంగా వినియోగించుకుంటున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన బృందం వెళుతోంది.

దీనిలో భాగంగానే ఈ నెల 20 నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు భావించారు. ఇందుకు భారత ప్రభుత్వ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయగా కేంద్రం పర్యటనకు అనుమతిస్తూనే ఆంక్షలు విధించింది. సీఎం వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా నలుగురికే అనుమతి ఇచ్చింది. అలాగే దావోస్ పర్యటనను ఏడు రోజులుకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి.