45 మంది ఎంపీలపై వేటు..

SMTV Desk 2019-01-04 10:49:50  Parlament sessions, rajyasabha, speaker sumithra mahajan, mps suspension, TDP, AIADMK, kaveri issue

న్యూఢిల్లీ, జనవరి 4: లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్న సభ్యులపై వరుసగా రెండో రోజు కొరడా విదిలించారు. జనవరి 2 బుధవారం 24 మందిని సస్పెండ్‌ చేసిన ఆమె..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ 45 మంది ఇక ఈ సెషన్‌లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 14 మంది టీడీపీ సభ్యులు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు ఉన్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి జలాల అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జీరో అవర్‌ ప్రారంభమైన వెంటనే ఏఐఏడీఎంకే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏఐఏడీఎంకే సభ్యులు స్పీకర్‌ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. ఆగ్రహించిన స్పీకర్‌..గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు.