ప్రతిపక్షాలపై బాబు సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-01-03 19:11:04  TDP, BJP, Congress party, TRS, Janasena, YSRCP, Chandrababu, KCR, Narendramodi, YS Jagan mohan reddy, Pawan kalyan

గుంటూరు, జనవరి 3: ఈ రోజు జరిగిన జన్మ భూమి సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓడిపోయినట్టుగానే ఏపీలో కూడ టీడీపీ ఓడిపోనుందని మోడీ చెప్పడం భవిష్యత్తులో చేసే కుట్రకు నాంది బాబు అభిప్రాయపడ్డారు. అంతేకాక తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడ పునరావృతమయ్యే అవకాశం ఉందని మోడీ చెప్పడాన్ని బాబు తప్పుబట్టారు. కేసీఆర్, మోడీ, వైఎస్ జగన్‌లు కుట్రకు పాల్పడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ ముగ్గురు మోడీలు కలిసి ఏపీలో టీడీపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సాగనిస్తామా అని బాబు ప్రశ్నించారు.కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలో టీడీపీ ఓటమి పాలైంది అయితే బీజేపీ ఎన్ని సీట్లు గెలిచారో చెప్పాలని మోడీనీ బాబు ప్రశ్నించారు. రెండు సార్లు మోడీ , ఏడు దఫాలు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముగ్గురు సీఎంలు ప్రచారం నిర్వహించినా కూడ తెలంగాణలో వొక్క సీటును మాత్రమే గెలిచారని బాబు ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే మోడీకి, కేసీఆర్‌కు ఆ సీట్లను గంపగుత్తగా అమ్ముకొంటారని బాబు ఆరోపించారు. తెలంగాణకు ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. 2020 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతామని బాబు చెప్పారు.జగన్ నెత్తిపై సీబీఐ కేసులు ఉన్నాయని బాబు ఎద్దేవా చేశారు. ఈ కేసుల నుండి బయట పడేందుకు కేసీఆర్, మోడీతో జగన్ చేతులు కలిపారని బాబు ఆరోపించారు. టీడీపీ హాయంలో ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. మోడీ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.