అస్తమించిన దిగ్గజ గురువు

SMTV Desk 2019-01-03 17:47:17  Sachin tendulkar, Ramakanth achrekar, BCCI

ముంబై, జనవరి 3: సచిన్ టెండూల్కర్‌తో పాటు అనేక మంది అంతర్జాతీయ, ఫస్ట్‌ క్లాస్‌ ఆటగాళ్లను దేశానికి అందించిన క్రికెట్ దిగ్గజం కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌(87) కన్ను మూశారు. గత కొంత కాలంగా అచ్రేకర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆటగాడిగా తన కెరీర్‌లో అచ్రేకర్‌ వొకే వొక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్‌బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. సచిన్‌తో పాటు ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో వినోద్‌ కాంబ్లీ, ప్రవీణ్‌ ఆమ్రే, సమీర్‌ దిఘే, బల్వీందర్‌ సింగ్‌ సంధూ, చంద్రకాంత్‌ పండిత్, అజిత్‌ అగార్కర్, రమేశ్‌ పొవార్‌ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు.

శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ పురస్కారం దక్కింది. అంతేకాక ముంబైలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ను అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో అచ్రేకర్‌ పాత్ర ఎనలేనిది. గురుపౌర్ణిమ సందర్భంగా అంద‌రూ గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటే.. సచిన్ మాత్రం తన గురువైన రమాకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అచ్రేకర్‌ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.